తెలంగాణ

telangana

ETV Bharat / state

Palamuru-Rangareddy lift irrigation: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతివ్వండి: సీఎం కేసీఆర్​ - telangana latest news

ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తర్వులు జారీ చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వీలైనంత త్వరగా అన్ని అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని మరోమారు కోరారు. కేంద్రం హామీ ప్రకారం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నందున రాష్ట్రానికి నీటివాటా కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Palamuru-Rangareddy lift irrigation
Palamuru-Rangareddy lift irrigation

By

Published : Sep 26, 2021, 5:44 AM IST

Palamuru-Rangareddy lift irrigation: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతివ్వండి: సీఎం కేసీఆర్​

ప్రాజెక్టుల అనుమతులు, తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ (ap-ts water disputes) అంశాన్ని సీఎం కేసీఆర్​ మరోమారు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ పర్యటనలో భాగంగా (cm kcr delhi tour) కేంద్ర జల్​​శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. కృష్ణా జలాల అంశాన్నే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (palamuru rangareddy lift irrigation)వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రాజెక్టును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మరోమారు వివరించారు. కరవుతో అలమటించిన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల కష్టాలు తీర్చే ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.

ఆర్​డీఎస్​ విస్తరణ ఆపాలని విజ్ఞప్తి..

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా పెద్దఎత్తున తరలిస్తోందని... రాయలసీమ ఎత్తిపోతల (rayalaseema lift irrigation) పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని వివరించినట్లు సమాచారం. అక్రమంగా చేపట్టిన ఆర్​డీఎస్​ (RDS) కుడికాల్వ విస్తరణ పనులనూ ఆపాలని కోరారు. కేవలం ఆదేశాలు కాకుండా పనులు ముందుకు సాగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్​ శక్తి శాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

గెజిట్​ అమలుకు సమయం తీసుకోండి..

అత్యున్నత మండలి రెండో సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నామని, తెలంగాణకు న్యాయపరమైన నీటివాటా తేల్చేందుకు కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని మరోమారు షెకావత్‌ను కోరినట్లు తెలిసింది. కేవలం వివాదాలు ఉన్న, ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని... అన్ని ప్రాజెక్టులు అయితే నిర్వహణ కష్టతరమవుతుందని సీఎం సూచించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులనూ అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చారని, వాటిని తొలగించాలని కోరినట్లు సమాచారం. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు ఇంకా సమయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. గోదావరికి సంబంధించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, సమ్మక్క ఆనకట్ట, రామప్ప-పాకాల అనుసంధానం లాంటి వాటిని పాత ప్రాజెక్టుల్లో భాగంగానే చూడాలని చెప్పినట్లు తెలిసింది. గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని... ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం.

అమిత్‌ షా నేతృత్వంలో నేడు సమావేశం

ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగే తీవ్రవాద ప్రభావిత ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే ఈ భేటీలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సన్నద్ధత, గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల అనుసంధానం, ఇదివరకు ఇచ్చిన నిధుల వినియోగం ఎంతవరకు వచ్చింది? విద్య సౌకర్యాల కల్పన, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు ఎజెండా అంశాలుగా పొందుపరిచినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం, ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అనుసంధానం గురించే ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్లు తెలిసింది. సారపాక, ఏటూరునాగారం, తుపాకులగూడెం, గోదావరి, ప్రాణహిత నదుల మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా చివరనున్న కౌటాల వరకు రహదారులు, గోదావరి నదిపైన వంతెనలు నిర్మించాలని కోరనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని అడగనున్నట్లు తెలిసింది.

ఇవీచూడండి:KCR meets Shekhawat: ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్​ పరిధిలోకి తేవాలి : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details