CM KCR Preparing attack for BJP: ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాల అంశాన్ని దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు. భాజపా కీలక నేతలే ప్రధాన లక్ష్యంగా దిల్లీ వేదికగా విరుచు పడేందుకు సిద్ధమవుతున్నారు. దిల్లీ వెళ్లి నేడు లేదా రేపు అక్కడే మీడియా సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను తెరాస నాయకత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఓ వైపు భాజపా విమర్శల దాడి చేస్తున్నప్పటికీ.. గులాబీ పార్టీ ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున పార్టీ నాయకులెవరూ మాట్లాడవద్దని కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. స్వయంగా కేసీఆర్ దిల్లీ వేదికగానే అన్ని విషయాలు బయటపెడతారని తెరాస శ్రేణులు చెబుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలు రెండు రోజులుగా ప్రగతిభవన్‌లోనే ఉన్నారు. కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. పూర్తి ఆధారాలను సిద్ధం చేసే పనిలో ప్రగతిభవన్ వర్గాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో గంటల కొద్ది వీడియో రికార్డయినట్లు సమాచారం. అదేవిధంగా దాదాపు పది రోజులుగా ఎమ్మెల్యేల ఫోన్లలో సుమారు ఆరు గంటల ఆడియో రికార్డులు ఉన్నట్లు చెబుతున్నారు.