రావి నారాయణరెడ్డి సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ, రైతు పోరాట యోధుడు, ప్రజాస్వామికవాదిగా మన్ననలు పొందారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు చేశారని.. పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల ఆయన ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి గొప్పదని సీఎం కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొనగానే.. సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామిక వాదని గుర్తుచేసుకున్నారు.
దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయాన్ని సాధించి రావి నారాయణరెడ్డి చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ప్రజా పోరాటాలు విజయవంతం కావాలంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ధిష్ట కార్యాచరణను అనుసరించాలనే సూత్రాన్ని ఆచరించి చూపారని పేర్కొన్నారు. రావి నారాయణరెడ్డి అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము అనుసరించిన పార్లమెంటరీ పోరాట పంథాలో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
ఇదీ చూడండి: హెచ్‌సీయూ వీసీగా రేపు అప్పారావు రిలీవ్.. అరుణ్ అగర్వాల్‌కు బాధ్యతలు