CM KCR Ugadi Wishes : శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికి సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగినప్పుడు అనేక సందేహాలు ఉన్నా.. అన్ని కష్టాలు అధిగమించి ప్రగతి పథంలో నడుస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ రాష్ట్రంలో అనేక విషయాల్లో అద్భుతాలు జరిగాయని చెప్పారు. రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందన్న కేసీఆర్.. విద్య, విద్యుత్, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు.
Ugadi AT Pragathi Bhavan : తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు సందడిగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, సభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ శుభకృత్ నామ సంవత్సరం అందరికీ శుభాలే కలగాలని వేద పండితులు వేద ఆశీర్వచనం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు.
తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి వెళ్లినా భూమి ధర పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో రూ.25 కోట్లతో విల్లా బుక్ చేసుకునే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వల్లే భూముల ధరలు పెరిగాయని వెల్లడించారు. తెరాస సర్కార్.. దళితబంధు పథకం వంటి ఎన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తోందన్న సీఎం.. దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని పునరుద్ఘాటించారు.