రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. అందరం కలిసి తెరాస కుటుంబంగా విజయాన్ని సాధించాలన్నారు. రానున్న శాసన మండలి, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలపై అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
మంచి నేతగా ఎదగాలి..
యువకులు, నిరుద్యోగులు తెరాసకు వ్యతిరేకమనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. ఉద్యమ కాలం నుంచీ యువత తెరాస వైపే ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ప్రగతిభవన్లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల్లో ఉండి.. సమస్యలు పరిష్కరిస్తూ మంచి నేతగా ఎదగాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజల్లో నమ్మకం సాధిస్తే.. ప్రతి ఎన్నికల్లోనూ గెలిచే పరిస్థితి ఉంటుందని వివరించారు.