Harekrishna Heritage Tower in Hyderabad : హైదరాబాద్ కోకాపేటలో హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 400 అడుగుల ఎత్తైన హరేకృష్ణ హెరిటేజ్ టవర్ (ఆలయం) నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సంస్థ నిర్వాహకులతో కలిసి ఆలయ నిర్మాణానికి సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టవర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25 కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్‌లో అతి త్వరలోనే అందమైన ఆధ్యాత్మిక కేంద్రం రాబోతుందన్న ఆయన.. శాంతియుతమైన సమాజ స్థాపనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Harekrishna Heritage Tower Foundation in Hyderabad : సామాజిక, ఆధ్యాత్మిక దారిలో ప్రజలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మనిషి ఏదైనా విజయం సాధిస్తే తన ప్రతిభగా చెప్పుకుంటాడని.. విపత్తు వస్తే మాత్రం దేవుడిపై నెపం వేస్తాడని తెలిపారు. మతమౌఢ్యం మనిషికి ముప్పు తెస్తుందన్న ఆయన.. మతమౌఢ్యంతోనే కొందరు సమాజానికి ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. దేశం, భాష, భావం, ఆహారం వేరైనా భగవంతుడి ఆరాధన ఒక్కటేనని స్పష్టం చేశారు. ఏ మతంలో తప్పు లేదని.. మత మౌఢ్యమే మనిషితో తప్పు చేయిస్తుందని వివరించారు.
''హైదరాబాద్‌కు త్వరలోనే అందమైన ఆధ్యాత్మిక కేంద్రం వస్తోంది. హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు ప్రభుత్వం తరఫున రూ.25 కోట్లు ఇస్తాం. శాంతియుతమైన సమాజ స్థాపనే మా లక్ష్యం. దేశం, భాష, భావం, ఆహారం వేరైనా దైవారాధన ఒక్కటే.'' - సీఎం కేసీఆర్
హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది..: ఈ క్రమంలోనే హరేకృష్ణ ఫౌండేషన్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని సీఎం కొనియాడారు. ఈ సంస్థ అక్షయ పాత్ర ద్వారా.. అన్నపూర్ణ సెంటర్ల ద్వారా తెలంగాణకు ఎంతో సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. అక్షయ పాత్ర కార్యక్రమం చాలా బాగుందన్న కేసీఆర్.. హైదరాబాద్‌లో ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయని వివరించారు. ఈ సందర్భంగా 'హరేకృష్ణ ఫిలాసఫర్స్' అందరికీ తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మతం పేరుతో జరిగే దుష్ప్రచారాలు పెరగకుండా ఉండేందుకు హరేకృష్ణ కృషి చేయాలని కోరారు.