భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మరో మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్-రాయదుర్గం మధ్య సేవలందిస్తున్న మెట్రో... మరింత విస్తరించింది. హైదరాబాద్‌లో ప్రధాన బస్‌స్టేషన్లైన ఎంజీబీఎస్ - జేబీఎస్ మధ్య 11 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. జేబీఎస్-పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ముఖ్యమంత్రి మెట్రో రైల్‌లో ప్రయాణించారు. సుమారు 18 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకున్నారు.
9 స్టేషన్లు
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మార్గంలో 69కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంజీబీఎస్ - జేబీఎస్ మార్గం పూర్తికావడంతో దేశంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో ఘనతను సొంతం చేసుకుంది. 11 కిలోమీటర్ల పొడవైన ఈ రూట్లో 9 స్టేషన్లు ఉన్నాయి. జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లుంటాయి. ఈ మార్గంలో కేవలం 16 నిమిషాల్లో ప్రయాణికులు ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ చేరుకోవచ్చు.