తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: కేంద్రంలో ఉన్నది రైతు హంతక, రాబందు ప్రభుత్వం: కేసీఆర్​

దేశంలో రైతులు బాగుపడాలంటే దుర్మార్గపు భాజపా ప్రభుత్వాన్ని పారదోలాలని ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) పిలుపునిచ్చారు. భాజపాను రైతురాబంధు పార్టీగా, కేంద్ర ప్రభుత్వాన్ని రైతు హంతక ప్రభుత్వంగా వర్ణిస్తూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్లలో 80 లక్షల కోట్ల అప్పులు చేసిన మోదీ హయాంలో దేశంలో పేదరికం పెరిగిందన్న ఆయన... భాజపా మతపిచ్చి, విభజన రాజకీయాలతో దేశాన్ని రావణకాష్టం చేయాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపైనా ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

CM KCR:  కేంద్రంలో ఉన్నది రైతు హంతక, రాబందు ప్రభుత్వం: కేసీఆర్​
CM KCR: కేంద్రంలో ఉన్నది రైతు హంతక, రాబందు ప్రభుత్వం: కేసీఆర్​

By

Published : Nov 30, 2021, 4:33 AM IST

వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr)​ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం... తన విధానాలతో రైతాంగాన్ని గందరగోళపరుస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అత్యధిక పంట పండిస్తోంటే కేంద్రం ఓర్వడం లేదని... రాష్ట్ర రైతు ప్రయోజనాలను, వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేస్తోందని మండిపడ్డారు. హంతక ప్రభుత్వం 750 మంది రైతులను పొట్టన పెట్టుకొందని... సాక్షాత్తూ ప్రధానమంత్రే క్షమాపణలు చెప్పారని అన్నారు. రేపు తెలంగాణ రైతులకు కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులు బాగుపడాలంటే భాజపా ప్రభుత్వాన్ని పారదోలాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

దిక్కు మాలిన మాటలు

దేశంలో ఆహార ధాన్యాలను సేకరించడం.. సేకరించిన వాటిని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించడం.. దేశ ఆహార భద్రత కేంద్రం బాధ్యత. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. కానీ.. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. రైతుల ప్రయోజనాలను, వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేస్తోంది. ఇది మంచి చేసే ప్రభుత్వం కాదు. ముంచే ప్రభుత్వం. తెలంగాణ రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనబోమని చెప్పడం దుర్మార్గం. ఇది రైతు వ్యతిరేక పార్టీ. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో భాజపా కన్నా తెలంగాణ ప్రభుత్వం కోటి రెట్లు మెరుగు. ఎన్నో రైతు సంక్షేమ విధానాలు అమలు చేస్తున్నాం. మా చేతుల్లో ఎన్ని ఉన్నాయో అన్నీ రైతులకు అందజేస్తం. తెలంగాణ రైతు బీమా పథకం మరెక్కడా లేదు. మేం వడ్లు కొనం.. అయినా కల్లాల కాడ కొట్లాడుతాం అంటరు.. పనికిమాలిన చట్టాలు చేసేది. వాపసు తీసుకునేది భాజపాయే. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సిగ్గులేకుండా మాట్లాడతారు. -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

రాష్ట్ర సర్కారు కొనుగోలు చేయదు

గత సంవత్సరం దాకా తీసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఒక గింజ కూడా తీసుకోం అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి? కేంద్రం చేతులెత్తేసింది.. గత యాసంగి ధాన్యమే పూర్తిగా తీసుకోలేదు. అప్పుడు రాష్ట్రం సేకరించిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు. రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకుని.. పంటలసాగుపై సరైన నిర్ణయం తీసుకోవాలి. సొంత వినియోగానికి, విత్తన కంపెనీలతో ఒప్పందం ఏదైనా ఉంటే వరి సాగు చేసుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరి కొనుగోలు చేయదు. -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

ధాన్యం కొనుగోళ్ల విషయమై వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలనుద్దేశించి మరో పనిలేదా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎలా అంటారని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం భిక్షగాళ్లలా చూస్తోందని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతగాని వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే కేంద్రంచే వడ్లు కొనిపించాలని డిమాండ్ చేశారు.

750 మందిని పొట్టన పెట్టుకుంది

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉప్పుడు బియ్యం కొంటారా? కొనరా? చెప్పమంటే చెప్పరట. వర్షాకాలం ఎంత తీసుకుంటారో చెప్పమంటే చెప్పరట. ఈ ఉల్టాపల్టా మాట్లాడి మేం బియ్యం కొనమన్నమా? అని అంటున్నారు. చాతకాని దద్దమ్మ. అయామ్‌ వెరీ సారీ. ఆయన ఏం మాట్లాడుతున్నరు. ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నరు. మీకు దమ్ముంటే తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనిపించాలి. తెలంగాణలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. 35 డిగ్రీల్లో ఎండల్లో పండుతాది మా పంట.. మీ చేతగానితనాన్ని మంది మీద రుద్దుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం. దిక్కుమాలిన చట్టాలు తెచ్చారు. మీ ప్రధానే క్షమాపణలు చెప్పారు రైతాంగానికి. 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న హంతకుల పార్టీ మీది.. మీరు మాట్లాడతారా? మీది రైతు రాబందుల పార్టీ. -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

దేశాన్ని రావణకాష్టం చేయాలని చూస్తున్నారు..

ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించిన కేసీఆర్... 80 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ వర్గానికి ఏమీ చేయలేదని అన్నారు. కేంద్ర విధానాలతో.. దేశంలో ఆకలి కేకలు పెరిగాయని అన్నారు. మరోవైపు నిల్వలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్నారని ఆక్షేపించారు. భాజపా నేతలు మతపిచ్చి, విభజన రాజకీయాలతో దేశాన్ని రావణకాష్టం చేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. ధాన్యం గురించి మాట్లాడమంటే హుజూరాబాద్ అంటూ భాజపా నేతలు మాట్లాడుతున్నారన్న ఆయన... ఎక్కడో ఒకచోట గెలిస్తే అంతా ఆగమవుతుందా అని ప్రశ్నించారు. విద్యుత్ చట్టం రద్దు కోసం, కనీస మద్ధతు ధర చట్టం కోసం పోరాడతామన్న కేసీఆర్... ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపుపై పోరాడతామని తెలిపారు

ఇది మనకు కుదురుతదా?

రైతుల ఉసురు పోసుకోవడానికి కేంద్రం కరెంటు చట్టం తెచ్చింది. బోర్లకు మీటర్లు పెట్టాలంటోంది. రైతు మెడపై కత్తి పెడతానంటోంది. లేకుంటే రాష్ట్రానికి వచ్చే హక్కులు, అధికారాలు కట్‌ చేస్తదట. కేంద్రమే విద్యుత్‌ మీద పెత్తనం చేస్తదట. అప్పుడు 24 గంటల కరెంటు వద్దంటరు. అందరిలాగానే 16 గంటలే ఇస్తమంటరు.. ఇది మనకు కుదురుతాదా? రైతులు, సామాన్యులకు రక్షణ ఉండాలంటే భాజపా ప్రభుత్వం పోవాలి. -కేసీఆర్​, రాష్ట్ర ముఖ్యమంత్రి

తీవ్రంగా స్పందించిన కేసీఆర్​

రాష్ట్రంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదన్న విమర్శలపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబీమా ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించిన ఆయన... 60 వేలకు పైగా రైతు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపారు. వ్యవసాయ చట్టాల ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు కేంద్రం 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

CM KCR PC: 'దమ్ముంటే బాయిల్డ్​ రైస్​ కొనిపించు.. కిషన్​రెడ్డి'

ABOUT THE AUTHOR

...view details