తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయబిల్లును వ్యతిరేకించండి.. తెరాస ఎంపీలకు సీఎం ఆదేశం - తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కెశవరావు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసే విధంగా ఉందని సీఎం కేసీఆర్​ అన్నారు. రేపు రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని తెరాస ఎంపీలను సీఎం ఆదేశించారు.

CM KCR directs the TRS MPs in the matter of that agriculture bill in rajya sabha
ఆ బిల్లు విషయంలో తెరాస ఎంపీలను ఆదేశించిన సీఎం

By

Published : Sep 19, 2020, 2:13 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రైతులను దెబ్బ తీసి కార్పొరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉండే ఆ బిల్లును వ్యతిరేకించాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కెశవరావును ఆదేశించారు. రేపు రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని సీఎం వివరించారు.

‘‘ పైకి చెప్పడానికి రైతులు తమ సరకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానమని అన్నారు. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించడానికి.. ప్రైవేటు వ్యాపారులకు ఉపయోగపడే బిల్లు అని పేర్కొన్నారు. రైతులు తమ సరకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా ? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దానిని వ్యతిరేకించి తీరాలి’’అని సీఎం చెప్పారు.

‘‘ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గియడం ఎవరి ప్రయోజనం కోసం. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉండే సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని అన్నారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి? " అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉంది కాబట్టి రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని సీఎం చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తెరాస ఎంపీలను ఆదేశించారు.

ఇదీ చూడండి :నా పేరు మీద వచ్చే సందేశాలకు స్పందించకండి: సీఐ

ABOUT THE AUTHOR

...view details