CM Kcr on Council Deputy Chairman Election: రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ పదవీకాలం ఫలప్రదం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. విద్యార్థి స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆయన సేవలు చాలా అవసరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఉన్నత విద్యావంతుడిగా వరంగల్ జిల్లా వాసిగా సుపరిచితులని.. ముదిరాజ్ సామాజిక అభ్యున్నతికి బండ ప్రకాశ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా బండ ప్రకాష్ కీలకపాత్ర పోషించడంతోపాటు నూతన రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని సీఎం వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బండ ప్రకాశ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ స్వయంగా బండప్రకాశ్‌ను తీసుకుని వెళ్లి.. మండలి డిప్యూటీ ఛైర్మన్ కుర్చిలో కూర్చోబెట్టారు.
శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండ ప్రకాశ్‌కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, జీవన్ రెడ్డి తదితరులు అభినందించారు. సభ్యులందరికీ చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ.. ముందుకెళ్లాలని బండప్రకాశ్‌ను సభ్యులు కోరారు.