CM KCR Condemned Rahul Gandhi Disqualification: రాహుల్ గాంధీపై లోక్‌సభకు రాకుండా అనర్హత వేటు వేయడంతో.. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అని అభివర్ణించారు. మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకు వాడడం గర్హనీయమని ఈ సందర్భంగా తెలిపారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కేసీఆర్ అన్నారు. ఇటువంటి దుర్మార్గ విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని చెప్పారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్: అంతకు ముందు ఈ విషయంపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం అని కేటీఆర్ ట్విటర్‌లో ట్వీట్ ద్వారా ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు అనేది.. పూర్తిగా రాజ్యాంగాన్ని వక్రీకరించే విధంగా ఉందని మండిపడ్డారు. బీజేపీ ఈ విషయంలో తొందరపాటుగా వ్యవహరించిందని.. రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఈ సందేశం పంపుతూ "నువ్వు చెప్పినదాన్ని నేను అంగీకరించను కానీ.. నీకు మాట్లాడే హక్కు ఉందని నా ఆఖరి క్షణం వరకు పోరాడుతాను అన్న.. ఫ్రెంచ్ రచయిత వోల్టేర్ మాటలను కోట్ చేశారు. దీంతో పాటు జర్మన్ థీయోలాజియన్ మార్టిన్ నీమోల్లర్ మాటలను సైతం పోస్ట్ చేశారు.
మంత్రి హరీశ్‌రావు ట్వీట్: రాహుల్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిసే రాహుల్ గాంధీపై వేటు వేశారని తెలిపారు. ప్రజల దృష్టి మరల్చే మోదీ మిషన్‌లో భాగంగానే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని ఆరోపించారు. వైఫల్యాలు, అవినీతి మిత్రుల నుంచి దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోదీ యత్నమని మండిపడ్డారు. విపక్షాలపై అణచివేత దృష్టిని మళ్లించేందుకే ఈ అనర్హత వేటుఅని అభిప్రాయపడ్డారు.