రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్... రెండు రోజుల వరుస సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు.
నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదాపై సమగ్రంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత బాగా పెరిగిన నేపథ్యంలో... ఈ శాఖను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. భారీ, మధ్య, చిన్న తరహా ఎత్తిపోతల విభాగాలుగా కాకుండా... అంతా ఒకే గొడుకు కిందికి తీసుకురావాలని సంకల్పించారు. పటిష్ఠ పర్యవేక్షణ కోసం చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో 15-20 ప్రాదేశిక భాగాలుగా విభజించాలని నిర్ణయించారు. ఆ ప్రాజెక్టులు, జలాశయాలు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యాములన్నీ సంబంధిత సీఈ పరిధిలోనే ఉండాలని తెలిపారు.