CM Jagan Tour Restrictions: ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఆ రాష్ట్ర సీఎం జగన్ పర్యటన అంటే నగరవాసులు భయపడుతున్నారు. శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొనడానికి సీఎం జగన్ శనివారం శారద పీఠానికి వస్తున్నారు. స్థానిక బీఆర్ టీఎస్ రోడ్డు నుంచి శారదాపీఠానికి వెళ్లే కిలోమీటర్ పరిధిలోని దుకాణాలను పోలీసులు భద్రత కారణాలతో మూసివేయించారు.
ఏమైనా అడిగితే ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భద్రత ఏర్పాట్లు పాటించాలని, దుకాణాల తెరవొద్దని అధికారులు చెప్పారంటూ చిరువ్యాపారులు వాపోయారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు చూసే అధికారులు నోటి మాట ద్వారా సీఎం జగన్ శారదా పీఠంలో కార్యక్రమాలు ముగిసే వరకు దుకాణాలు తెరవద్దని చేప్పేశారు. ఫలితంగా దుకాణాలు తెరవకుండా సీఎం పర్యటన ఎప్పుడు ముగుస్తుందా అని చిరు వ్యాపారులు ఎదురుచూస్తున్నారు.