సీఏఏకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా గుంటూరు బీఆర్ స్టేడియంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆదివారం నిర్వహించిన సింహ గర్జన సభలో అసదుద్దీన్ పాల్గొన్నారు. ఈ సభ స్పందన చూసిన తర్వాతైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుంటే.. సీఏఏ పైన ఇంత జాప్యం జరిగేది కాదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని చూసి ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న ఎన్‌పీఆర్‌ను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలన్నారు. ఆలస్యం చేస్తే కోట్లమందిపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఇంటింటికి సర్వే కోసం వచ్చే వారికి ప్రజలు జాతీయ జెండా చూపించి భారతీయులమని చెప్పాలని అసదుద్దీన్ సూచించారు. ఈ సభకు వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు.
వైఎస్సార్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: అసదుద్దీన్
ప్రధాని మోదీని చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన ఓ సభకు హాజరైన ఆయన.... సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ బతికుంటే ఇంత జాప్యం చేసేవారు కాదని ఒవైసీ అన్నారు.
జగన్కు భయం: అసదుద్దీన్
ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నఎన్‌పీఆర్‌ను నిలుపుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలి. ఇవాళ వైఎస్సార్ బతికుంటే ఎన్‌పీఆర్‌ను నిలిపివేయడానికి ఆయన రెండు నిమిషాలైనా ఆలోచించేవారు కాదు. ఏపీ సీఎం జగన్ మన మాటలను పెడచెవిన పెట్టి భాజపా, ప్రధాని మోదీ అంటే ఉన్న భయంతో ఏపీలో ఎన్‌పీఆర్‌ను అనుమతిస్తే దాన్ని మేం బహిష్కరిస్తాం. దాన్ని మేం స్వాగతించబోం. ఇంటింటికి సర్వే కోసం వచ్చే వారికి జాతీయ జెండా చూపించి భారతీయులమని చెప్పండి- అసదుద్దీన్, ఎంఐఎం అధినేత