పురుగు మందుల అవశేషాలే ఏపీ ఏలూరు పరిస్థితికి కారణమని అధ్యయనం చేసిన నిపుణులు తేల్చారు. ఈ విషయాన్ని దిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు ధ్రువీకరిస్తూ తాము జరిపిన పరిశోధన ఫలితాలను ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నివేదించాయి. ఏలూరులో పలువురి అస్వస్థతకు కారణాలపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ ముత్యాలరాజు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, జలవనరుల శాఖ , వ్యవసాయశాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎన్ఐఎన్, ఎన్ఐసీటీ, ఎయిమ్స్- దిల్లీ, ఎయిమ్స్- మంగళగిరి, సీసీఎంబీ, నీరి–హైదరాబాద్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రతినిధులు తమ పరిశోధన వివరాలను తెలిపారు.
- రోగుల రక్తంలో లెడ్---దిల్లీ ఎయిమ్స్
అస్వస్థతకు గురైన వారి రక్తంలో లెడ్ కనిపించిందని నిపుణులు తేల్చారు. పాలకు సంబంధించి అన్ని శాంపిల్స్‌లో నికెల్ కనిపించిందని దిల్లీ ఎయిమ్స్ నివేదించింది. రోగులను పరిశీలిస్తే ఆర్గానో క్లోరిన్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. బహుశా పురుగు మందులు కారణంగానే ఇది వచ్చి ఉండొచ్చని తెలిపారు. ఆహార సైకిల్లో భాగంగా అది శరీరంలో చేరే అవకాశం ఉందని తెలిపారు.
అస్వస్థతకు గురైన వారితో పాటు, వారి బంధువుల రక్త నమూనాల్లో కూడా లెడ్ కనిపించిందని తెలిపారు. దీర్ఘకాలంలో దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని నెలల పాటు ఆహార పదార్థాలు, తాగు నీరు, కూరగాయలు తదితర శాంపిళ్లను పరిశీలిస్తే అస్వస్థతకు దారి తీసిన వైనంపై కచ్చితమైన కారణం కనుక్కునే అవకాశం ఉందన్నారు.
- రక్తపు నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ--ఐఐసీటీ
మనుషులు, పశువుల నుంచి సేకరించిన రక్తపు నమూనాల్లో ఎండో సల్ఫాన్, డీడీడీ కనిపించాయని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ నిపుణులు తెలిపారు. కొన్ని రక్తపు నమూనాల్లో లెడ్ కనిపించిందని, ఆర్గనో ఫాస్పేట్స్ కనిపించలేదన్నారు. తాగునీటిలో ఎలాంటి గుర్తించదగ్గ భారీ లోహాలు కనిపించలేదన్నారు.
లెడ్ కాని, ఆర్సెనిక్ కాని, నికెల్ తరహా లోహాలు కాని లేవన్నారు. తాగునీరు పరిశుభ్రంగానే ఉందన్నారు. ఏలూరులో గాలి కూడా సాధారణ స్థాయిలోనే ఉందని వెల్లడించారు. భూగర్భ జలాల శాంపిళ్లపై పరిశీలన జరిపినట్లు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) హైదరాబాద్ తెలిపింది. ఉపరితల జలాల్లో కూడా అన్ని పరిమిత స్థాయిలోనే ఉన్నాయని, మెర్క్యురీ మాత్రం సాధారణ పరిమితికి మించి ఉందని వెల్లడించింది. ఆర్గానో క్లోరిన్ కాని, ఆర్గానో ఫాస్పేట్స్, లెడ్ కాని కనిపించలేదని నిపుణులు తెలిపారు.
- కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు--ఎన్ఐఎన్