కరోనా నివారణ సహాయ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై ఆరా తీశారు. వైరస్ ఎవరికైనా సోకవచ్చన్న సీఎం.. అంత్యక్రియలు అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావచ్చన్నారు. కరోనా సోకిన వారిని అంటరానివారిగా చూడడం సరికాదని హితవుపలికారు. బాధితులపై ఆప్యాయత, సానుభూతి చూపించాలి గానీ వివక్ష కూడదన్నారు.
అంతిమ సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం సరికాదన్న సీఎం... ఎవరైనా అలా ప్రవర్తిస్తే తీవ్రంగా స్పందించాలని డీజీపీని ఆదేశించించారు. కరోనా వస్తే.. మందులు తీసుకుంటే పోతుందని స్పష్టం చేశారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నం చేయవద్దని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్పారు.