తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దు: ఏపీ సీఎం జగన్​ - schools reopen in ap

సమయాభావం ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు, తరగతుల ప్రారంభంతో పాటు ప్రైవేట్ వర్శిటీల నాణ్యతా ప్రమాణాలపై చర్చించారు.

cm jagan review meeting with education department
విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దు: ఏపీ సీఎం జగన్​

By

Published : Nov 2, 2020, 9:10 PM IST

విద్య అన్నది వికాసానికి దారి తీయాలే తప్ప ఒత్తిడితో సతమతమయ్యే పరిస్థితి ఉండొద్దని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో జగన్​ సమీక్షించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు, వాటి ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఈ ఏడాదిలో క్లాసుల ప్రారంభం, తీసుకుంటున్న చర్యలను తెలిపారు. కొవిడ్‌ వేళ 'ఎనీ టైం - ఎనీ వేర్‌ లెర్నింగ్'‌ పద్ధతిలో క్లాసులు నిర్వహించామని వెల్లడించారు.

ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి మరింతమందికి ఆన్ లైన్ తరగతులు అందుబాటులోకి తేవాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సమయం కవర్ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దన్నారు. చదువులు ఆనందంగా సాగాలి కానీ, ఒత్తిళ్ల మధ్య ఉండకూడదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రమాణాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరైనా ప్రైవేటు సంస్థలకు వెళ్తారని... ఆయా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రమాణాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలన చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు, ఉండాల్సిన సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద, మిగిలిన 50 శాతం సీట్లు కాలేజీ కోటా కింద ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు యూనివర్శిటీలకు నిర్వహిస్తున్న కోర్సుల ప్రకారం ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ–న్యాక్‌ గుర్తింపు కూడా ఉండాలన్నారు.

ఐఐటీ తిరుపతి, ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి, ఐఐఎం విశాఖ, ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెంల్లో పనుల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఆయా సంస్థలకు వెళ్లే రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి వాటిలో సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో కొత్త కోర్సులను తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details