రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు శుక్రవారం నుంచి ఉచిత బియ్యం, శనివారం నుంచి నగదు బదిలీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్ ప్రకటించటంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను ఆదుకునేందుకు కార్డుదారుడి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం, నిత్యావసర సరకుల కొనుగోలుకు కుటుంబానికి రూ.1,500 చొప్పున నగదు బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఏప్రిల్‌లో మాదిరిగానే మే నెలలో కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం బ్యాంకులు, పోస్టాఫీసులకు సెలవు కావటంతో శనివారం నుంచి నగదు బదిలీ ప్రారంభం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి కార్డుదారునికి ఒక కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన రాష్ట్రంలోని 87.54 లక్షల కార్డుదారులకు నెలకు 8,754 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం కాగా ఇప్పటి వరకు జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య(నాఫెడ్) నుంచి 3,233 మెట్రిక్ టన్నులే సరఫరా అయింది.