CII Letter To KTR: నెలకు ఒక్కో మెగావాట్‌కు రూ.2,37,500 గ్రిడ్ మద్దతు ఛార్జీలను వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిందని.. దీని వల్ల పరిశ్రమలు నష్టపోయే అవకాశాలున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈనెల 2న రాసిన లేఖలో సీఐఐ ప్రతినిధులు పేర్కొన్నారు. పరిశ్రమలకు సంబంధించి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకునే ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల ఎక్కడా ఈ తరహా ఛార్జీలు లేవన్నారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గ్రిడ్ సపోర్ట్ ఛార్జీలు మెగావాట్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేల లోపే ఉన్నాయని వెల్లడించారు.
పరిశ్రమల విస్తరణకు విఘాతం
తెలంగాణ ప్రభుత్వం విధించాలనుకున్న గ్రిడ్ సపోర్ట్ ఛార్జీల కారణంగా ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతోందని సీఐఐ ప్రతినిధులు పేర్కొన్నారు. దానివల్ల పరిశ్రమల మధ్య పోటీతత్వంపై ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు సైతం ఇది విఘాతంగా మారుతుందని తెలిపారు. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి గ్రిడ్ మద్దతు ఛార్జీలను క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల సిమెంట్, పేపర్, మెటలర్జికల్ సంబంధిత కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఇతర క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్‌పై ప్రభావం పడుతుందని లేఖలో వెల్లడించారు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్‌పై గ్రిడ్ మద్దతు ఛార్జీలను వేయాలనే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సీఐఐ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:స్వతంత్ర భారత్‌లో విజయవంతమైన స్టార్టప్.. తెలంగాణ: కేటీఆర్