Christmas Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జరిపిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌తో కలిసి హాజరయ్యారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
తెల్లవారుజాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలకు తరలివచ్చారు. కాజీపేటలోని ఫాతిమా చర్చిలో పిల్లాపాపలతో తరలివచ్చి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరకాల పట్టణంలో సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. మత గురువు ఏసు ప్రభును కీర్తిస్తూ పాటలు పాడారు. హైదరాబాద్‌లో క్రిస్మస్ పండుగ సందర్భంగా.. నగరంలో పలు ప్రాంతాల్లో చర్చిలన్నింటినీ అందంగా ముస్తాబు చేశారు.
విద్యుత్ దీపాలతో అందంగా చర్చిలు..:నారాయణగూడలోని 1969 నాటి బాపిస్ట్ చర్చిని.. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఆదర్శ్‌నగర్ బ్యాడ్‌లాండ్‌లోని చర్చిలో అర్ధరాత్రి నుంచే పెద్దఎత్తున క్రిస్టియన్లు.. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఎల్ఈడీ దీపాలతో చర్చి పరిసర ప్రాంతాలు అలరిస్తున్నాయి. సమాజంలో శాంతి, సహనంతో ప్రజలందరూ జీవించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని పలు చర్చిలలో జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల పట్ల ఆదరణ.. సర్వ మతాలను సమానంగా చూసే విధానం సీఎం కేసీఆర్ పాటిస్తారని తెలిపారు.
మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు..: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఏసుప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. పాస్టర్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో లక్షలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. మనిషి సమృద్ధిగా జీవించడానికి ఏసుక్రీస్తు మార్గంలో నడవాలని సందేశాన్ని అందించారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు.