తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రికి వచ్చే ఏ రోగికి చికిత్స నిరాకరించరాదు: సీఎస్‌ - telangana news

కొవిడ్​పై పోరులో అన్ని శాఖలు కలిసి పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై కలెక్టర్లు, వైద్యాధికారులతో సీఎస్​ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రోగి పరిస్థితి ఆధారంగా తగిన వైద్యం అందేలా చూడాలని... ఆసుపత్రికి వచ్చే ఏ రోగికి చికిత్స నిరాకరించరాదని సూచించారు.

ఆసుపత్రికి వచ్చే ఏ రోగికి చికిత్స నిరాకరించరాదు: సీఎస్‌
ఆసుపత్రికి వచ్చే ఏ రోగికి చికిత్స నిరాకరించరాదు: సీఎస్‌

By

Published : Apr 24, 2021, 9:00 PM IST

రానున్న రోజుల్లో కొవిడ్​ను ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన 12 వేల అదనపు పడకలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

మౌలికసదుపాయాలు, మానవ వనరులను కొవిడ్ నియంత్రణలో సమర్థంగా వినియోగించుకోవాలన్న సీఎస్... మహమ్మారిపై పోరులో అన్ని శాఖలు కలిసి పనిచేయాలని కోరారు. రోగుల పరిస్థితుల ఆధారంగా అన్ని ఆసుపత్రుల్లో తగిన వైద్యం ఇచ్చేలా వ్యవస్థ ఉండాలని, స్వల్ప లక్షణాలున్న వారికి చికిత్స కోసం కరోనా కేర్ సెంటర్లను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని సోమేశ్ కుమార్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ఏ రోగికీ చికిత్స నిరాకరించరాదన్న సీఎస్​... ప్రతి రోగికీ తగిన చికిత్స అందేలా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలతో కలెక్టర్లు రోజుకు రెండుసార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పారు. కలెక్టర్లు అవసరమైతే ఇతర శాఖల నుంచి సిబ్బందిని కేటాయించాలని లేదా తాత్కాలిక పద్ధతిన నియమించుకోవాలని సీఎస్ చెప్పారు. ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమైన ఆక్సిజన్​ను జాగ్రత్తగా వాడుకోవాలన్న సీఎస్... ఒక్క యూనిట్ కూడా వృథా కారాదని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థంగా ఆక్సిజన్​ను ఉపయోగించుకుంటేనే కొవిడ్ వేవ్​ను సమర్థంగా నియంత్రించవచ్చని అన్నారు. ఆసుపత్రుల్లో వీలైనంత ఎక్కువ మంది రోగులకు చికిత్స అందేలా చూడాలని, అవకాశం ఉన్న చోట కొవిడ్ వార్డులుగా మార్చి ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. బోధనాసుపత్రుల్లో ఉన్న మానవవనరులు, మౌలికసదుపాయాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details