GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల ఆందోళన, అధికారుల వాకౌట్‌తో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. నగరంలో సమస్యల పరిష్కారం కోరుతూ.. నిన్న పలువురు బీజేపీ కార్పొరేటర్లు జలమండలి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకోగా.. ఇవాళ జరగాల్సిన పాలకమండలి సమావేశానికి ముందే నిరసనలతో హోరెత్తించారు. వినూత్న ప్రదర్శనలతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.
GHMC Council Meeting today: మరోవైపు కాంగ్రెస్ కార్పొరేటర్లు సైతం ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నగరంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం, సమావేశం ప్రారంభం కాగా.. కాసేపటికే బీజేపీ కార్పొరేటర్లు సమావేశంలో నినాదాలు చేశారు. మేయర్ విజయలక్ష్మి వారిస్తున్నా వెనక్కి తగ్గలేదు. పలువురు కార్పొరేటర్లు మేయర్ కుర్చీ వద్దకు వెళ్లటంతో సమావేశంలో రసాభాస నెలకొంది. ఈ క్రమంలోనే జలమండలి కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఘటనలను తీవ్రంగా పరిగణించిన అధికారులు సమావేశాన్ని వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Chaos at GHMC Council Meeting :తమ కార్యాలయం ముందు టిల్ట్ వేయటాన్ని అవమానంగా భావించినట్లు అధికారులు మేయర్‌కు వివరించి, అనంతరం సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. జలమండలి అధికారులకు సంఘీభావంగా జీహెచ్‌ఎంసీ అధికారులూ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓ వైపు అధికారుల బాయ్‌కాట్, విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనటంతో సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. కాగా పాలకమండలి సమావేశం వేళ బీజేపీ కార్పొరేటర్ల తీరును మేయర్ విజయలక్ష్మి తప్పుబట్టారు. సమావేశంలో సమస్యలు చర్చించకుండా అధికారులను దూషించటం, వాగ్వాదం దిగటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి రాజకీయ లబ్ధికోసం యత్నించటం సరికాదని మేయర్ హితవు పలికారు.
GHMC officials walkout: మేయర్ వైఫల్యంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ కార్పొరేటర్లు ఎదురుదాడి చేశారు. తాము ప్రజాసమస్యలపై పోరాడుతుంటే సమాధానం చెప్పలేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారని మండిపడ్డారు. అధికారులే వాకౌట్ చేయటం జీహెచ్‌ఎంసీ చరిత్రలో తొలిసారి అని దీనికి మేయర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.