Chandrababu visit Polavaram to Tension: పోలవరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాజెక్టు సందర్శనకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లనీయరని పోలీసులను ప్రశ్నించిన చంద్రబాబు.. కాసేపు వాగ్వాదం తర్వాత అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఏపీలోని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ప్రాజెక్టు పరిశీలనకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు నిలువరించారు. రహదారికి అడ్డంగా బారికేడ్లతో పాటు ముందుకు వెళ్లకుండా వాహనాలను అడ్డుగా పెట్టారు. దీంతో చంద్రబాబు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ లిఖితపూర్వకంగా సమాధానం రాసి ఇవ్వాలని పోలీసులను నిలదీశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు తాను ప్రారంభించి, సగానికి పైగా పనులు పూర్తిచేసిన ప్రాజెక్టు వద్దకు తననే వెళ్లనీయరా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంతో పాటు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.