Chandrababu Fires On Ministers: అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంత్రుల చర్యను తీవ్రంగా ఖండించారు. రామతీర్థం సాక్షిగా వైకాపా అరాచకం బట్టబయలైందన్నారు. దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే.. దాడులు చేసే సంస్కృతికి వైకాపా ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Chandrababu On Ramatheertham incident: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారన్న చంద్రబాబు.. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని ఆరోపించారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదు, భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు అని బాబు ప్రశ్నించారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అరాచక, దుర్మార్గాలు ఎల్లకాలం సాగబోవని చంద్రబాబు హెచ్చరించారు.
ఏం జరిగిందంటే...?
Ramatheertham incident: విజయనగరం జిల్లా బోడికొండపై ఉన్న కోదండ రామాలయ నిర్మాణం కోసం జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చెలరేగింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. ప్రభుత్వం శంకుస్థాపన చేయడం ఏంటని ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు ప్రశ్నించారు. ధర్మకర్తల మండలితో చర్చించకుండానే ప్రభుత్వం.. ఆలయ పునర్నిర్మాణం చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తరఫున ఏర్పాటు చేసిన పునర్నిర్మాణ, శంకుస్థాపన శిలాఫలకాలను తోసేశారు. స్పందించిన అధికారులు అశోక్ గజపతిరాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో అధికారులు.. అశోక్‌కు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కోదండ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మంత్రులు వెల్లంపల్లి, బొత్స నారాయణ గుడికి వచ్చారు.
హిందూ ధర్మాన్ని కాపాడాలి - అశోక్ గజపతిరాజు