MLA Kotam Reddy Latest Comments: ''అధికారం అనుభవించి చివరలో బయటకెళ్లడం నాకు ఇష్టం లేదు. బెదిరింపులు, కష్టాలు ఎదుర్కొని నా వెనక నిలిచిన వారికి కృతజ్ఞతలు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అండగా నిలిచారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ప్రజాపక్షాన నిరసన గళం వినిపిస్తా. టీడీపీ నుంచి పోటీ చేయాలనేది నా ఆకాంక్ష. టీడీపీ నుంచి నా పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు. ప్రజలకు దగ్గరగా ఉండేందుకు నిత్యం కార్యక్రమాలు చేస్తూనే ఉంటా.'' అని ఏపీలోని నెల్లూరు గ్రామీణ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 18 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెటింగ్ సొసైటీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. కష్టకాలంలో తనకు అండగా ఉండేందుకు మద్దతిచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మార్కెటింగ్ సొసైటీ నాయకులకు కోటంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సైకిల్ గుర్తుపై గెలిచి వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు సిద్ధమైతే.. తాను కూడా సిద్ధమేనని ఆయన సవాల్ విసిరారు. వాళ్లను వదిలేసి తన గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు అవకాశమిస్తే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు కోటంరెడ్డి పునరుద్ఘాటించారు.
ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న మాట్లాడిన మూడు నిమిషాల్లో మూడు రకాల స్టేట్మెంట్లు ఇచ్చాడు. మొదట దమ్ము ఉంటే.. నాపై పోటీ చేయమన్నాడు. మళ్లీ ప్రతి 5 సంవత్సరాలకు అభ్యర్థులు మారుతారు అన్నాడు. ముందు ఆదాల ఒక మాట మీద నిలబడు. అలాగే, నిన్న ఒక ఎమ్మెల్యే నా రాజీనామా గురించి మాట్లాడాడు. టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ గుర్తుతో గెలిచి.. వైసీపీలోకి వచ్చిన వారిని ముందు రాజీనామా చేయమను. ఆ తర్వాత నా రాజీనామా గురించి ఆలోచిద్దాం.- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే