తెలంగాణ

telangana

By

Published : Sep 14, 2021, 7:48 PM IST

ETV Bharat / state

Kishan Reddy: రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి రూ.300 కోట్లు ఇచ్చాం: కిషన్​ రెడ్డి

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద నిధులిచ్చినట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖకు సమాధానంగా ఆయన వివరాలు వెల్లడించారు.

central tourism minister kishan reddy
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రం రూ.300 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద కేంద్రం నిధులిస్తున్నట్లు స్పష్టం ఆయన చేశారు. స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 3 పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధికి రూ.268.39 కోట్లు, ప్రసాద్ పథకం కింద రూ.36.73 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖకు సమాధానంగా కేంద్రమంత్రి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015-16లో రూ.91.62 కోట్లు, ములుగు - లక్నవరం- మేడారం-తాడ్వాయి-దామరవి- మల్లూరు- బొగత జలపాతంను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2016-17లో రూ.79.87 కోట్లు మంజూరు చేశామన్నారు.

అలాగే కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, పైగా టూంబ్స్, హయత్ బక్షి మస్క్, రేమండ్స్ టూంబ్‌లను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు 2017-18లోనే రూ.96.90 కోట్లు మంజూరు చేశామని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రసాద్ పథకం కింద అలంపూర్‌లోని జోగులాంబ దేవి అమ్మవారి ఆలయం అభివృద్ధికి 2020-21లో రూ.36.73 కోట్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి వివరించారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి లేఖలో తెలిపారు.

ఇదీ చూడండి:BJP: తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే: బండి సంజయ్‌

ABOUT THE AUTHOR

...view details