మహిళల కనీస వివాహ వయస్సు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు... పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ అంశాన్ని పునః పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి నుంచి అనేక విషయంపై అనేక స్పందనలు, ప్రతిపాదనలు వస్తున్నాయి.
18 నుంచి 21కి పెంపు
ప్రస్తుతం యువతులకు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. యువకులకు అది 21 ఏళ్లు. కాగా ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. ఈ అంశాలపై మరింత క్షుణ్నంగా అధ్యయనం తేసేందుకే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం మహిళలు ఏ వయసులో తల్లి అయితే ఆరోగ్యకరమో అన్న విషయమై అధ్యయనం చేయడానికి ఈ కార్యదళం పని చేస్తుంది. శిశు మరణాలు, మాతృ మరణాలు, సంతాన సాఫల్య రేటు, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాల సమగ్ర పరిశీలన దీని ఉద్దేశం.