రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశం ముగిసింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రత్యేకించి ఆసుపత్రుల నిర్వహణపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో చర్యలు, పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంపు, ట్రేసింగ్, చికిత్సపై దృష్టి సారించాలని కేంద్ర బృందం సూచించింది. కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రానున్న రెండు నెలల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేంద్ర బృందం కోరింది.
ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి.. కేంద్ర బృందం సూచన - గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం
కరోనాపై రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశం ముగిసింది. సీఎస్ సోమేశ్‌కుమార్, అధికారులతో కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చికిత్స, సదుపాయాలు, ఇతర అంశాలపై చర్చించింది. కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రానున్న రెండు నెలల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేంద్ర బృందం తెలిపింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించి అక్కడ ఉన్న ఏర్పాట్లను బృందం పరిశీలించింది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం.. టిమ్స్‌లో ఐసీయూ, ఐసోలేషన్ పడకల వివరాలపై ఆరా తీసింది. పర్యవేక్షణ, కంటైన్మెంట్ జోన్లలో చర్యలు, ఆసుపత్రుల సన్నద్ధత, రక్షణ సామగ్రి, సేకరణ, నివారణ చర్యలను కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు. 17,081 పడకలు ఉన్నాయని, 4,489 మంది సిబ్బందిని అదనంగా నియమించుకున్నామని అధికారులు వివరించారు. వైద్య సదుపాయాల కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి :తొలిసారిగా ప్రైవేటు మెడికల్ కళాశాలలో కరోనా టెస్టులు