Piyush Goyal on paddy: తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరణకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ క్లియరెన్స్ ఇస్తుందని ఆయన వెల్లడించారు. పేదలకు సాయం చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు. పేదలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నారు. పేదలకు ఇంత అన్యాయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదని గోయల్ విమర్శించారు.
పేదలకు ఉన్న హక్కు ప్రకారం వారికి ఆహారధాన్యాలు అందాల్సిందేనని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున అదనపు ధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక విఫల ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సీఎం, మంత్రులు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని గోయల్ అన్నారు. రాజకీయ అజెండాతోనే కేంద్రంపై తెరాస ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రతిదీ రాజకీయం చేయకుండా.. పేదల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఎఫ్‌సీఐ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీయూష్ గోయల్ విమర్శించారు.