Kishanreddy on TRS: ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయవిపత్తుల నిర్వహణ కింద రూ.3 వేల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి 2018 నుంచి విపత్తు సహాయానికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద తెలంగాణకు ఎలాంటి సహాయం అదించట్లేదని తెరాస తప్పుదోవ పట్టించే ప్రకటన చేసిందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం ఎలాంటి సహాయం అందించడంలేదని తెరాస నేతలు తప్పుడు వాదనలు ప్రచారం చేస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.
2020-2021లో జీహెచ్ఎంసీకి వరదల వేళ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి సుమారు రూ.599 కోట్లు ఇవ్వగా.. అందులో కేంద్రం వాటా రూ.449 కోట్లు ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు విడతలుగా ఆ మొత్తం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్‌లో.... ఇప్పటికే రాష్ట్ర వాటాతో కలిపి రూ.1,500 కోట్లు ఉంటే అందులో దాదాపు 1,200 కోట్లు భారత ప్రభుత్వ వాటా ఉందని వివరించారు. 2020లో జీహెచ్‌ఎంసీ వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం అందించేందుకు ఆ నిధులు సరిపోతాయన్నారు. 2021-2022లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి మొత్తం కేటాయింపు రూ.479.20 కోట్లు కాగా అందులో కేంద్ర వాటా రూ.359.20 కోట్లు అని కిషన్ రెడ్డి తెలిపారు.