Kishan Reddy on National Highways: అమెరికా సంపన్న దేశం కావడానికి అక్కడ అద్భుత రహదారులే కారణమని.. దేశంలోనూ కేంద్ర సర్కారు పెద్దఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతోందని, అందులో తెలంగాణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి (పీఎం సడక్ యోజన కాకుండా) కేంద్రం రూ.91,511 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. శనివారమిక్కడ నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కమిటీ నివేదించడంతోనే కేంద్రం చేపట్టలేదని.. కానీ తామే సొంతంగా నిర్మించుకుంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకామాట నిలబెట్టుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
32 జిల్లా కేంద్రాలకు ఎన్‌హెచ్‌ల అనుసంధానం..
‘‘రాష్ట్రంలో పెద్దపల్లి మినహా 32 జిల్లా కేంద్రాల్ని జాతీయ రహదారులతో అనుసంధానించాం. 2014లో మోదీ ప్రధాని కావడానికి ముందు రాష్ట్రంలో జాతీయ రహదారులు 2511 కిలోమీటర్లే. ఆ తర్వాత ఏడేళ్లలోనే మరో 2,483 కి.మీ. నిర్మించిన ఘనత కేంద్రానిది. ఇప్పటికే పూర్తయిన రోడ్లకు రూ.31,624 కోట్లు వ్యయం చేశాం. నడుస్తున్న ప్రాజెక్టులకు రూ.12,019 కోట్లు, మంజూరైన వాటికి రూ.15,113 కోట్లు, పీఎం గతిశక్తి ప్రాజెక్టు, సూపర్ ఇన్ఫర్మేషన్ హైవేకు రూ.32,755 కోట్లు. మొత్తం రూ.91,511 కోట్లు. ఇంకా ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి రూ.9,164 కోట్లు, సీఆర్‌ఐఎఫ్ రాష్ట్ర రోడ్ల పనులకు రూ.3,314 కోట్ల మొత్తాన్ని కేంద్రం ఖర్చు చేయనుంది.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని వేగవంత ప్రయాణం, ప్రమాదాలు లేకుండా.. సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా అభివృద్ధి చేయబోతున్నాం. దీన్ని 4 నుంచి 6 వరుసలకు విస్తరిస్తారు. రూ.4,750 కోట్లతో డీపీఆర్ తయారవుతోంది.