రాష్ట్ర ప్రభుత్వానికి దళితుల ఓట్లు కావాలి కానీ.. వారి ఆత్మగౌరవం వద్దా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని కూలగొడితే.. పట్టించుకునే వారే లేరని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీహెచ్‌ను కిషన్ రెడ్డి.. హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
కిషన్‌కు వీహెచ్ విజ్ఞప్తులు
అంబేడ్కర్ విగ్రహం మూడేళ్ల నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంటుందని.. ఆ విషయం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వీహెచ్.. కిషన్ రెడ్డితో అన్నారు. ఆ విగ్రహాన్ని పీఎస్ నుంచి బయటకు తేవాలని కేంద్ర మంత్రిని కోరారు. అంబర్పేట్ నియోజకవర్గంలో గతంలో మహాత్మ జ్యోతిరావు పూలే ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వీహెచ్ పేర్కొన్నారు. రెవెన్యూ ఇబ్బందులతో ఆడిటోరియం.. నిర్మాణానికి నోచుకోలేదని కిషన్ రెడ్డితో అన్నారు. ఆడిటోరియం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరారు.