తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి -కావేరి అనుసంధానంపై రాష్ట్రాలతో 18న కేంద్రం చర్చ

ప్రధాన గోదావరి, ప్రాణహితలో లభ్యమయ్యే నీటితో సంబంధం లేకుండానే గోదావరి-కావేరిల అనుసంధానానికి అవసరమైన 247 టీఎంసీల నీటి లభ్యతకు ఢోకా లేదని జాతీయ జల అభివృద్ధి సంస్థ తెలిపింది. ఇలా గోదావరి, కృష్ణా, కావేరి నదుల భాగస్వామ్య రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో ఈ నెల 18న కేంద్ర జల్​శక్తి మంత్రిత్వ శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

central jal shakthi ministry meeting with states on godavari- cauvery connectivity
గోదావరి -కావేరి అనుసంధానంపై రాష్ట్రాలతో 18న కేంద్రం చర్చ

By

Published : Sep 16, 2020, 7:12 AM IST

కాళేశ్వరం(మేడిగడ్డ) దిగువన ఇంద్రావతి, దిగువ గోదావరిలో 75 శాతం నీటి లభ్యత కింద 747 టీఎంసీలు లభ్యమవుతాయని జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌.డబ్ల్యు.డి.ఎ) తాజాగా అంచనా వేసింది. ప్రధాన గోదావరి, ప్రాణహితలో లభ్యమయ్యే నీటితో సంబంధం లేకుండానే గోదావరి-కావేరిల అనుసంధానానికి అవసరమైన 247 టీఎంసీల నీటి లభ్యతకు ఢోకా లేదని ఈ సంస్థ అభిప్రాయపడింది. భాగస్వామ్య రాష్ట్రాల అవసరాలు పోను 324 టీఎంసీలు అందుబాటులో ఉంటుందని, ప్రతిపాదిత పథకానికి కావాల్సింది 247 టీఎంసీలే కాబట్టి ఎలాంటి సమస్య లేదని ఎన్‌.డబ్ల్యు.డి.ఎ పేర్కొంది.

రెండు ప్రత్యామ్నాయాలపై చర్చ

గోదావరిపై తెలంగాణలోని జనంపేట నుంచి నాగార్జునసాగర్‌-సోమశిల మీదుగా కావేరి మీదున్న గ్రాండ్‌ ఆనకట్ట వరకు నీటి మళ్లింపు పథకాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. నదుల అనుసంధానంలో భాగంగా మహానది నుంచి గోదావరికి, గోదావరి నుంచి కృష్ణా, పెన్నా మీదుగా కావేరి వరకు నీటిని మళ్లించాల్సి ఉండగా, మహానదిలో ఎంత మిగులు ఉందన్న దానిపై ఒడిశా.. కేంద్రం అభిప్రాయంతో ఏకీభవించకపోవడంతో అది పెండింగ్‌లో పడింది. దీంతో ప్రత్యామ్నాయంగా గోదావరి(జనంపేట)-కావేరి అనుసంధానాన్ని ప్రతిపాదించిన కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. దీనికి కొన్ని రాష్ట్రాలు మాత్రమే సానుకూలంగా స్పందించాయి. జనంపేట నుంచి కాకుండా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి ఎత్తు తగ్గించి నిర్మించి అనుసంధానం చేయొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.

ఈ రెండు ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి నివేదిక తయారుచేసిన జాతీయ జల అభివృద్ధి సంస్థ దీనిపై చర్చించనుంది. ఇందుకు ఈ నెల 18న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు.. ఇలా గోదావరి, కృష్ణా, కావేరి నదుల భాగస్వామ్య రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో రెండు ప్రత్యామ్నాయ పథకాల గురించి చర్చించనున్నారు.

ప్రతిపాదనలివీ...

  • తుపాకులగూడెం బ్యారేజిని మేడిగడ్డ దగ్గర లభ్యమయ్యే నీటితో ప్రతిపాదించినట్లు ఎన్‌.డబ్ల్యు.డి.ఎ. తెలిపింది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు, చందూరు మండలాలకు సాగు, తాగునీరిచ్చే అవకాశాలపైన కూడా అధ్యయనం చేయమనడంతో ఇచ్చంపల్లి, జనంపేటల నుంచి నీటిని మళ్లించే రెండు ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
  • జనంపేట వద్ద 67 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టంతో నీటిని మళ్లిస్తే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తమిళనాడులోని తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై జిల్లాలు మార్గమధ్యంలో వస్తాయి. ఇచ్చంపల్లి నుంచి అయితే తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, నల్గొండ జిల్లాలు వస్తాయని వివరించింది.
  • ఇచ్చంపల్లి నుంచి నాలుగు లిప్టులు అవసరం కాగా 1782 మెగావాట్ల విద్యుత్తు, జనంపేట నుంచి మూడు లిప్టులు 1497 మెగావాట్ల విద్యుత్తు అవసరమని నివేదించింది.
  • ఐదేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేస్తే 2018-19 ధరల ప్రకారం ఇచ్చంపల్లి నుంచి రూ.73611 కోట్లు, జనంపేట నుంచి రూ.60311 కోట్లు అవుతుందని, విద్యుత్తు ఖర్చు నిర్వహణ వ్యయం ఏటా వరుసగా రూ.9332 కోట్లు, రూ.7714 కోట్లు కానుంది. వీటన్నింటిపైనా 18న జరిగే సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చదవండిఃకూడవెల్లి వాగు అందాలు తిలకించిన మంత్రి హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details