Central Govt Released Funds for Roads: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కృషి ఫలించింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రోడ్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ జాతీయ కార్యదర్శి కమల్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
పలుమార్లు విజ్ఞప్తి...
మొత్తం మంజూరైన నిధుల్లో దాదాపు రూ.204 కోట్లు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని రహదారుల నిర్మాణానికి కేటాయించడం విశేషం. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ శాఖల ద్వారా నిధులు రాబట్టేందుకు బండి సంజయ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. సీఐఆర్ఎఫ్ కింద రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయడం పట్ల బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు.