రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు ఫలించాయి. బియ్యం సేకరణకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసింది. యాసంగి సీజనులో రాష్ట్రం భారీగా 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాటి నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం వస్తాయి. కేంద్రం 24.75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామని చెప్పింది. దిగుబడి భారీగా రావటంతో కనీసం 50 లక్షల మెట్రిక్ టన్నులవరకైనా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోగా 20 లక్షల మెట్రిక్ టన్నులను అదనంగా తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను లెక్కించిన మీదటే అదనపు ధాన్యం తీసుకుంటామని స్పష్టం చేసింది. 225 మిల్లులను ఎంపిక చేసి పౌరసరఫరాల శాఖ ఇచ్చిన జాబితా మేరకు భారత ఆహార సంస్థ అధికారులు తనిఖీల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక ఇవ్వటంతో బియ్యం తీసుకునేందుకు గడువును పొడిగిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
యాసంగి బియ్యానికి 48 రోజులు
యాసంగి (రబీ)లో అదనపు కోటా కలుపుకొని బియ్యం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం 48 రోజులు (నవంబరు 30 వరకు) గడువు ఇచ్చింది. ఇప్పటివరకు ఎఫ్‌సీఐకి 21 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన మూడు లక్షల మెట్రిక్ టన్నులతోపాటు అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండటంతో అంత గడువు నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. వానా కాలం (ఖరీఫ్) సీజనుకు సంబంధించి సుమారు 32 వేల మెట్రిక్ టన్నుల మాత్రమే ఉండటంతో ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. నిర్ధారిత గడువులోగా మిల్లర్ల నుంచి బియ్యం ఎఫ్‌సీఐకి చేర్చేలా చూడాల్సిన బాద్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని పేర్కొంది.