గ్రామాల్లో సత్వర సమస్యల పరిష్కారం, ప్రణాళికాబద్ధమైన ప్రగతి కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ తాజాగా పలు సూచనలు చేసింది. గ్రామపంచాయతీల్లో ఏడాదికి కనీసం ఆరు లేదా గరిష్ఠంగా నెలకు ఒకటి చొప్పున 12 గ్రామసభలు నిర్వహించాలని పేర్కొంది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్వహణకు ప్రత్యేకంగా ఆరు ఉప కమిటీలను నియమించాలని, గ్రామసభలకు అదనంగా మహిళా, బాలసభలు ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజా సూచనల ప్రకారం.. ప్రతి వార్డు సభ్యుడు రొటేషన్ పద్ధతిలో నెల రోజుల పాటు ‘రోజు వారీ పంచాయతీ అధికారి’గా వ్యవహరించాలి. ఆ వార్డు సభ్యుడే నెల రోజులపాటు అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేందుకు వీలైన సమయాల్లోనే గ్రామసభలు నిర్వహించాలి. వీటి ఏర్పాటుకు జనాభాలో కనీసం 10 శాతం కోరం ఉండాలి. అధికారిక కార్యక్రమాల్లో సర్పంచుల, వార్డు సభ్యుల భర్తలు పాల్గొనడానికి వీల్లేదు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇవి అక్టోబరు నుంచి అమలులోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని, పంచాయతీ రాజ్ చట్టాల్లో వీటికి సంబంధించిన సవరణలు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
ఇవీ సూచనలు..
- గ్రామసభల్లో కార్యాచరణ ప్రణాళిక ప్రవేశపెట్టి, గతంలో తీసుకున్న నిర్ణయాలు, చర్యలను అందరికీ తెలియజేయాలి. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికతో పాటు సిటిజన్ ఛార్టర్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి.
- వార్షిక క్యాలెండర్ రూపొందించి, ఆ మేరకు కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టాలి. గ్రామసభల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలి.
- చేపట్టిన అభివృద్ధి పనులు, పరిపాలన పనితీరు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. గ్రామసభల వీడియోలను అప్‌లోడ్ చేయాలి. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకురావాలి. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక డ్యాష్‌బోర్డును తీసుకురానుంది.
- ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ నెలకొల్పాలి.
- ప్రజాసమస్యల పరిష్కారం సమగ్ర వికాసానికి గ్రామస్థాయిలో ఆరు స్టాండింగ్ ఉప కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో సాధారణ, ఆరోగ్య-పారిశుద్ధ్య-పోషకాహార, ప్రణాళిక-అభివృద్ధి, విద్య, సామాజిక-న్యాయ, తాగునీటి సరఫరా-పర్యావరణ పరిరక్షణ కమిటీలు ఉంటాయి. వీటి కాలపరిమితి ఐదేళ్లు. గ్రామ అవసరాల మేరకు అదనపు ఉప కమిటీలను నియమించుకోవచ్చు. ఒక్కో వార్డు సభ్యుడు రెండు కన్నా ఎక్కువ కమిటీల్లో సభ్యుడిగా ఉండటానికి వీల్లేదు.