దేశంలో విద్యుత్తు సంక్షోభం నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. బొగ్గు లభ్యత, కరెంటు ఉత్పత్తి పరిస్థితులపై ప్రధానమంత్రి కార్యాలయం (PMO NEWS) మంగళవారం స్వయంగా సమీక్ష నిర్వహించింది. నల్లబంగారం సరఫరాను పెంచాల్సిందిగా బొగ్గు శాఖను ఆదేశించింది. మరోవైపు- సొంత వినియోగదారుల అవసరాలను పట్టించుకోకుండా కొన్ని రాష్ట్రాలు/డిస్కంలు తమ దగ్గర ఉత్పత్తయ్యే కరెంటును పవర్ ఎక్స్ఛేంజ్‌లో అధిక ధరలకు విక్రయించుకుంటుండటంపై కేంద్ర విద్యుత్తు శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. బొగ్గు కొరత(Coal Shortage in India) పేరుతో కరెంటు కోతలు విధించొద్దని ఆదేశించింది. అవసరమైతే తమ వాటా(కేంద్ర విద్యుదుత్పత్తి ప్లాంట్లలో ఎవరికీ కేటాయించని 15% కరెంటు)ను వినియోగించుకోవాలని సూచించింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్తు సంక్షోభం(power crisis) తలెత్తబోతోందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పీఎంవో కీలక సమీక్షా సమావేశం(PMO review on electricity) నిర్వహించింది. కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్ కుమార్, బొగ్గు శాఖ కార్యదర్శి ఎ.కె.జైన్ తదితర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
కీలక సూచనలు
బొగ్గు రవాణా(Coal Shortage in India) పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నల్లబంగారం సరఫరాను పెంచాలని బొగ్గు శాఖను పీఎంవో ఆదేశించింది. విద్యుత్తు కర్మాగారాలకు బొగ్గు రవాణా చేసేందుకు సరిపడా పెట్టెలను అందుబాటులో ఉంచాలని రైల్వేకూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/డిస్కంలు స్వరాష్ట్రంలో కోతలు విధిస్తూ.. తమ కరెంటును పవర్ ఎక్స్ఛేంజ్‌లో అధిక ధరలకు విక్రయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర విద్యుత్తు శాఖ తెలిపింది. సొంత వినియోగదారుల అవసరాలను పట్టించుకోకుండా అలా చేయడం సరికాదని పేర్కొంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అలాంటి చర్యలకు పాల్పడితే.. దానికి తమ వాటా(ఎవరికీ కేటాయించనిది)లోని విద్యుత్తును వాడుకునే వెసులుబాటును ఉపసంహరించుకుంటామని హెచ్చరించింది. ఆ కోటాను ఇతర రాష్ట్రాలకు అందిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంటే.. తమ వాటా నుంచి కరెంటును వాడుకోవచ్చని పేర్కొంది. ఏ రాష్ట్రం వద్దనైనా మిగులు విద్యుత్తు ఉంటే తమకు తెలియజేయాలని కోరింది. దాన్ని అత్యవసరమున్న ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపింది. కేంద్ర విద్యుత్తు శాఖ ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.