వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు, రిస్క్ తగ్గించి ఆదాయాలు పెరిగేలా ప్రపంచ స్థాయి టెక్నాలజీ చిన్నసన్నకారు రైతులకు చేరవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సీఐఐ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న 3వ అగ్రిటెక్ సౌత్ - 2022 సదస్సును మంత్రి ప్రారంభించారు. అగ్రిటెక్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.
అగ్రిటెక్ ప్రదర్శనలో కొలువుదీరిన 100 స్టాళ్లను మంత్రి నిరంజన్ రెడ్డి తిలకించారు. కీలక వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, పనిముట్లు, ఆవిష్కరణలు, సూక్ష్మ సేద్యం, సేంద్రియ వ్యవసాయం, వినూత్న అంశాలను పరిశీలించారు. వ్యవసాయం... ఈ తరహా ప్రదర్శన కొత్త తరానికి ఇచ్చే సందేశం అని మంత్రి అన్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, శారీరక శ్రమ దినాలు, రాబడి పెంపు సవాళ్లు అధిగమించేందుకు పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తల నేతృత్వంలో నవీన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల జవాబుదారీ లేని రాజకీయ వ్యవస్థ కొనసాగుతుందని కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. వ్యవసాయ రంగం సరైన దారిలో ఉండకపోతే ఇతర రంగాలు బాగుండవని ప్రొఫెసర్ స్వామినాథన్ అంటుంటారని గుర్తు చేశారు. సాంకేతిక రంగంలో 6వ స్థానంలో భారత్ ఉన్నప్పటికీ మనషులను విభజించి కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నదులు సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు నిర్మించి దేశాన్ని సుభిక్షం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదని ధ్వజమెత్తారు. స్వరాష్ట్ర సాధన తర్వాత వ్యవసాయ రంగం పురోగమిస్తోందని... ఎనిమిదేళ్లలో దేశంలో ఎక్కడా 10 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు నిర్మించలేదని ఆక్షేపించారు.