Loan Eligibility for AP State in First Quarter: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పుపుట్టే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఈ ఆర్థిక ఏడాది సాఫీగా ముగియాలంటే దాదాపు 21 వేలకోట్లు అవసరం కాగా.. కేంద్రం కేవలం రూ. 4వేల 557 కోట్లు అప్పు తీసుకునేందుకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ మూడు నెలలు ఈ కొద్దిమొత్తంతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆర్థిక ఏడాది మొత్తం రూ. 49వేల 860 కోట్ల బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతించగా.. ఇప్పటికే రూ. 45 వేల303 కోట్లు సేకరించింది.
దీంతో మిగిలిన రూ. 4 వేల557 కోట్లు మాత్రమే రుణంగా పొందేందుకు అనుమతులు ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసింది. చివరి త్రైమాసికంలో 21 వేల కోట్ల అప్పు అవసరమని కేంద్ర ఆర్థికశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నికర రుణ పరిమితికి లోబడే కొన్ని సందర్భాల్లో రుణాలు తీసుకున్న పరిస్థితులను కూడా ఆర్థికశాఖ అధికారులు ప్రస్తావించి.. మరిన్ని అప్పులు ఇవ్వాలని కోరింది. దిల్లీలోనే కొద్దిరోజులుగా మకాం వేసి రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాల అప్పులను కొత్త మార్గదర్శకాలతో పర్యవేక్షిస్తోంది.
ఆ ప్రకారం 2016-17నుంచి 2018-19ల మధ్య కాలంలో రాష్ట్రం రూ. 17వేల 923 కోట్లు అదనంగా అప్పులు చేసింది. ఆ అప్పులను మినహాయించి మిగిలిన రుణాలకు మాత్రమే అనుమతులు ఇస్తామని కేంద్రం పదేపదే చెబుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. విడతల వారీగా మినహాయించుకోవాలని కొన్ని సార్లు.. పాత రుణాలు జమ చేసుకోవద్దని ఇంకొన్నిసార్లు చెబుతూ వస్తోంది.
రాష్ట్రానికి 2022-23లో 44 వేల574 కోట్ల నికర రుణ పరిమితిగా తొలుత నిర్ణయించారు. తొలి 9నెలల్లో రూ. 43 వేల303 కోట్ల అప్పుకే కేంద్రం పరిమితం చేసింది. సీపీఎఫ్ కోసం ప్రభుత్వ వాటా, ఉద్యోగుల వాటాగా చెల్లించే రూ. 4 వేల 203 కోట్లను కూడా రుణంగా అదనంగా ఇస్తామని కేంద్రం పేర్కొంది. విద్యుత్ సంస్కరణల అమలు పేరుతో కేంద్రం మరో 2 వేల కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. అన్నీ కలిపి 8నెలల లోపే రాష్ట్ర ప్రభుత్వం రూ. 45 వేల303 కోట్లు రుణంగా తీసుకుంది. దీంతో మిగిలిన రూ. 4 వేల 557 కోట్లకు అనుమతి వచ్చింది.