NREGA funds Due to Telangana : వలసలు, ఆకలి కేకలకు అడ్డుకట్ట వేస్తూ.. గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు అమలుచేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధుల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పథకం కింద చేపట్టే పనుల కోసం.. రావాల్సిన బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పనులు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఆపివేసింది. రూ.151 కోట్లను రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గతంలో స్పష్టం చేసింది.
ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల మధ్య చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. రాష్ట్ర అధికారులు దిల్లీ వెళ్లి మరీ కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపారు. రికవరీ చేయాల్సిన రూ.151 కోట్లలను మినహాయించి దాదాపు రూ.1000 కోట్ల బకాయిల్లో మిగతా మొత్తాన్ని ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా చర్చలు జరిగాయి. ఆ తర్వాత దాదాపు రూ.250 కోట్ల మేర కేంద్రం నిధులు విడుదల చేసింది. మిగతా మొత్తం ఇంకా రాష్ట్రానికి రావాల్సి ఉంది. రూ.151 కోట్లను జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన కేంద్రం.. పలు షరతులను కూడా విధించినట్లు సమాచారం.
Telangana NREGA funds on hold : ఆ మొత్తాన్ని మినహాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఇంకా రూ.650 కోట్లకు పైగా రావాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. నిధుల విడుదలలో జాప్యంతో క్షేత్రస్థాయిలో పనులు నెమ్మదించాయి. భారీగా మంజూరు చేసిన సీసీ రోడ్ల పనుల ప్రారంభంపై కూడా ఈ ప్రభావం పడింది.