హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరంలో జరుగుతోన్న ఫార్ములా ఈ రేసింగ్ లీగ్‌లో పలువురు ప్రముఖలు సందడి చేశారు. గ్యాలరీ నుంచి తమ ఫేవరెట్ జట్టు అయిన భారత్‌కు చెందిన మహీంద్రాకు సపోర్ట్ చేశారు. సినీనటుడు నాగార్జున, రామ్‌చరణ్, నాగ చైతన్య, అఖిల్, నవదీప్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు నాగ్ అశ్విన్, సినీ నిర్మాత అల్లు అరవింద్, క్రికెటర్లు యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధవన్, మాజీ క్రికెటర్ సచిన్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేసింగ్‌ను వీక్షించారు. భారత్‌కు రావటం చాలా సంతోషంగా ఉందని ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ మహమ్మద్ సులేమాన్ పేర్కొన్నారు.
భారత్‌లో మోటార్ స్పోర్ట్ నిర్వహించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత్‌లో ఈ స్పోర్ట్ హై లెవెల్లో ఉందని.. భవిష్యత్తులో రేసింగ్ నిర్వహించడానికి మరికొన్ని ట్రాక్‌లనూ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఇప్పుడు నిర్వహించినట్టే ఎఫ్ఐఏ.. ప్రభుత్వం మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారత్ నుంచి కూడా రేసర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని.. మరికొంతమంది కార్ల తయారీదారులు కూడా రేసింగ్ లీగ్‌లో పాల్గొనాలని కోరారు.
మరిన్ని జరగాలి..:భారత దేశంలో ఇలాంటి రేసులు రావడం చాలా సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అంతర్జాతీయ రేసింగ్‌లు భారత్‌లోనూ.. అందులోను హైదరాబాద్‌లో మరిన్ని జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఏపీకి చెందిన ఎంపీలు సి.ఎం.రమేశ్, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ ఫార్ములా రేస్‌ను వీక్షించేందుకు విచ్చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందన్నారు. ఫార్ములా ఈ రేసుకు రెండో రోజు హాజరైన కేటీఆర్.. అసెంబ్లీ సమావేశాల కారణంగా తొలి రోజు రాలేకపోయానన్నారు.