CEC Notices to Minister KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు (Minister KTR ).. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. టీ వర్క్స్ కార్యాలయంలో స్టూడెంట్ ట్రైబ్ సమావేశం, అందులో చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై హామీ ఇస్తూ చేసిన వ్యాఖ్యలపై.. రణదీప్ సింగ్ సుర్జేవాలా సీఈసీకి ఫిర్యాదు చేశారు.
Election Commission of India Notices to KTR :రాజకీయ కార్యకలాపాల కోసం.. ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను వాడుకున్నారని.. రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Singh Surjewala) ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఈవో, అధికారుల నివేదిక ఆధారంగా.. కేటీఆర్ ప్రాథమికంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. సిరిసిల్ల నుంచి ఎన్నికల్లో పోటీలో ఉండడంతో పాటు స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయన.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేటీఆర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు, నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొంది.
కేసీఆర్‌కు నోటీసులు..: కేంద్ర ఎన్నికల సంఘం.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) సైతం శనివారం రోజున నోటీసులు జారీ చేసింది. బాధ్యతాయుతమైన పదవితో పాటు పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని.. వాటిని తీవ్రంగా పరిగణిస్తామంటూ సీఈసీ సలహా (అడ్వయిజరీ) అందులో హెచ్చరించింది. ఈ లేఖను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయాలని సూచించింది.