బిగ్‌బాస్ సీజన్-4ను నిలిపివేయాలని... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో తెలంగాణ మహిళా హక్కుల వేదిక, పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యార్థి ఐకాస పిటిషన్ దాఖలు చేసింది. సమాజానికి ఈ షో ఏ మాత్రం ఉపయోగపడదని... మానవ సంబంధాలను, కుటుంబ వ్యవస్థను దెబ్బతీసేలా ఈ షో ఉంటుందని వారు హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు.
'బిగ్‌బాస్ షోను ఆపేయండి... దానివల్ల ఉపయోగం లేదు' - బిగ్‌బాస్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిగ్‌బాస్ షోను నిషేధించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. షో ద్వారా పిల్లలపై దుష్ప్రభావం పడుతోందని... పెద్దలు మానసిక ఆందోళనకు గురువుతున్నారని ఫిర్యాదు చేశారు.
కొవిడ్-19తో దేశమంతా అల్లాడుతుంటుంటే... ఒకే హౌస్‌లో 50మందికి పైగా నిబంధనలు ఉల్లంఘిస్తూ... నెలల తరబడి ఉండటం సమంజసం కాదన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... అధిక ఫీజులు తగ్గించాలని ధర్నా చేస్తున్న తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు... బిగ్‌బాస్ షో వ్యవహారం కనిపించట్లేదా అంటూ వారు ప్రశ్నించారు. ఇలాంటి షోలు యువతను, విద్యార్థులను పెడదారి పట్టిస్తున్నాయని... వీటిని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ షో జరగకుండా నిలిపివేయాలని హెచ్ఆర్సీని కోరారు.
ఇదీ చూడండి:'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే'