CAG Report: శాసనసభలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కాగ్ నివేదికలను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా ఖర్చు చేయడం శాసనసభ అధికారాన్ని తగ్గించడమేనని కాగ్ పేర్కొంది. 2014-15 నుంచి అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసిన రూ. లక్షా 32వేల 547కోట్ల వ్యయాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉందని వెల్లడించింది. పద్దుల నిర్వహణపై ఆందోళన వ్యక్తంచేసింది. 2020-21 ఆర్థిక ఏడాది ఆదాయం గణనీయంగా తగ్గగా వ్యయం పెరిగినట్లు వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో 2020-21లోనే అత్యల్ప వృద్ధిరేటు నమోదైందని స్పష్టం చేసింది. 2020-21 ఆర్థిక ఏడాది మొదట్లో చేబదుళ్లపైఆధారపడాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయన్న కాగ్... గతఆర్థిక ఏడాదిలో దేశంలో 2.97శాతం తరుగుదల నమోదైనా రాష్ట్రం మాత్రం... 2.42 శాతం వృద్ధి నమోదు చేసిందని వెల్లడించింది. 2018-19 వరకు రెవెన్యూ మిగులులో ఉన్న రాష్ట్రం.. వరుసగా రెండేళ్లు 22 వేల 298 కోట్ల రెవెన్యూ లోటు నమోదు చేసిందని పేర్కొంది.
పెరిగిన రెవెన్యూ ఖర్చులు...
2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో రాష్ట్ర రెవెన్యూ రాబడి స్వల్పంగా... రూ. 1,630 కోట్లు తగ్గగా రెవెన్యూఖర్చులు రూ. 14వేల 414 కోట్లు పెరిగినట్లు కాగ్ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా రాబడి రూ. 66,650 కోట్లు, పన్నేతర ఆదాయం కింద రూ. 6,101 కోట్లుగా ఉండగా... గతేడాదితో పోలిస్తే ఆ రెండూ స్వల్పంగా తగ్గాయని వివరించింది. గతేడాది కేంద్ర పన్నుల వాటా కింద రూ. 12 వేల 692 కోట్లు వచ్చినా గడిచిన మూడేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు తెలిపింది. గతేడాది సహాయక గ్రాంట్లు కింద రూ. 15వేల471 కోట్లు రాగా... అవి క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. ఐతే 15వ ఆర్థిక సంవత్సరం సిఫారసు చేసిన ప్రత్యేక గ్రాంట్లల్లో రూ. 964 కోట్లు... రాష్ట్రానికి రాలేదని స్పష్టం చేసింది.