గ్రేటర్ పరిధిలో దాదాపు లక్షా 50 వేల క్యాబ్‌లు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఓలా, ఊబర్ సంస్థల్లో సుమారు 80 వేల మంది ఓనర్ కం డ్రైవర్లు ఉన్నారు. మరో 50 వేల మంది వాహనాలను లీజుకు తెచ్చి నడిపిస్తున్నారు. కరోనా వ్యాప్తితో గిరాకీలు పడిపోవడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లి ఆయా కుల వృత్తులు, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. గత కొద్ది వారాలుగా కరోనా రెండోదశ ఉద్ధృతితో రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ క్యాబ్ డ్రైవర్లకు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు.
రోజుకు రూ.200 కూడా మిగలడం లేదు..
కరోనా నేపథ్యంలో గిరాకీలు పడిపోగా.. పెరిగిన ఇంధన ధరలు, జీఎస్టీ క్యాబ్ డ్రైవర్లను ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నాయి. గతంలో రోజుకు రూ. 15 వందల వరకు ఆదాయం వచ్చేదని.. ఇప్పడు డీజిల్, జీఎస్టీ, క్యాబ్ సంస్థల కమీషన్ పోనూ కనీసం రూ.2 వందలు కూడా మిగలడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. ఓ పక్క కార్ల కోసం తీసుకున్న అప్పులకు నెలసరి వాయిదాలు చెల్లించలేక.. మరోపక్క ఇంటి అవసరాలు తీర్చలేక తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిలకు లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను, ఇతర వ్యాపారులను, ఉద్యోగులను ఆదుకున్నట్టుగానే తమనూ ఆదుకోవాలని క్యాబ్‌డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.