తెలంగాణ

telangana

ETV Bharat / state

'బస్తీ కోసం బరిలోకి దిగిన క్యాబ్ డ్రైవర్ భార్య' - జీహెచ్ఎంసీ తెదేపా వార్తలు

బతికినంత కాలం బతికి చనిపోతే పూడ్చేందుకు సరైన శ్మశానవాటిక లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు ఆ డివిజన్ ప్రజలు. బస్తీల్లో రోడ్లు సహా అనేక సమస్యలు చుట్టుముట్టినా ఏదో ఒక నేత తమకు సాయం చేయకపోతారా అని ఆశగా ఎదురుచూశారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎందుకు ఎదురు చూడాలి? మనకోసం మనమే ఏదో ఒకటి చేసుకునేలా ఎదగాలంటోంది ఆ యువతి. కుటుంబంలో అంతా క్యాబ్, ఆటో డ్రైవర్లే అయినా చెక్కు చెదరని మనోధైర్యంతో కార్పొరేటర్ బరిలో దిగింది. గెలిచి, తమ సమస్యని పరిష్కరించుకుంటానంటోన్న ఫర్హానా బేగంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

'ఆర్థిక స్థోమత లేకున్నా... బస్తీ కోసం బరిలోకి దిగిన యువతి'
'ఆర్థిక స్థోమత లేకున్నా... బస్తీ కోసం బరిలోకి దిగిన యువతి'

By

Published : Nov 24, 2020, 5:33 PM IST

Updated : Nov 24, 2020, 8:53 PM IST

'బస్తీ కోసం బరిలోకి దిగిన క్యాబ్ డ్రైవర్ భార్య'

రాజకీయాలకు ఆర్థిక స్థోమత అక్కర్లేదు. ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండాలి. వాటిని పరిష్కరించే అంకితభావం కావాలంటోంది 28 ఏళ్ల ఫర్హానా బేగం. ఏన్నో ఏళ్లుగా బేగంపేట డివిజన్ వాసులకు శ్మశాన వాటిక లేదని ఎందరో నేతలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు చేసుకోవటమే తప్ప సమస్య పరిష్కరించలేదని చెబుతోంది.

మనమే పరిష్కరించుకుందాం...

నేతల మాటలను నమ్మే ఓపిక లేక తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని భావించిన ఫర్హానా... ఈసారి జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెదేపా తరఫున బేగంపేట డివిజన్ నుంచి బరిలోకి దిగింది. ఇంటింటికి తిరిగి ఓట్లడుగుతున్న ఆ అమ్మాయి... మన ఏరియా సమస్యను మనమే పరిష్కరించుకుందామని పిలుపునిస్తోంది. ఫర్హానా భర్త ఓ క్యాబ్ డ్రైవర్, ఆమె సోదరుడు ఆటో డ్రైవర్​గా జీవనం సాగిస్తున్నారు.

ఆటంకం కాదు...

పేదరికం తన గెలుపునకు ఆటంకం కాదని... ఒకప్పుడు ఎన్టీఆర్ అంతటివారే జోలెపట్టిన విషయాన్ని గుర్తు చేస్తోంది. ఆయన స్ఫూర్తితో ప్రచార ఖర్చుల కోసం చందాలు వసూలు చేస్తూ ఓ పేదబిడ్డను గెలిపించాలని కోరుతోంది. మంచి చేయాలనుకునే వారికి రాజకీయాల్లో చోటు ఉంటుందని చాటాలని కోరుతోంది.

జోలెపట్టి...

భర్త నిత్యం క్యాబ్ నడిపితే తప్ప ఇళ్లు గడవని పరిస్థితి ఫర్హానాది. స్థానికులకు మంచి చేయాలన్న తపన తప్ప... కనీసం నామినేషన్ వేసేందుకు ఖర్చు చేయలేని పరిస్థితి. సోదరుడు, కుటుంబ సభ్యుల అండతో తెదేపా తరఫున బరిలో నిలిచిన ఫర్హానా... ఆ పార్టీ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన నామినేషన్ కోసం కావాల్సిన డబ్బును అందించారు. ప్రచారానికి కావాల్సిన సామగ్రి కోసం స్థానికులను జోలెపట్టి అడుగుతున్నారామె. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు.

ప్రజల మద్దతే రక్ష...

మద్యం, బిర్యానీ పొట్లాలు, డబ్బులిచ్చి ఓట్లను తెదేపా కొనుగోలు చేయదని ప్రజల మద్ధతే తమకు శ్రీరామ రక్ష అంటున్నారు ఫర్హానా తరఫున ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన. బేగంపేట డివిజన్ బిడ్డగా పేద ఇంటి నుంచి వచ్చిన ఫర్హానాకు పేదల కష్టాలు స్థానిక సమస్యలపట్ల అవగాహన ఉందని అలాంటి వారిని గెలిపిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని కోరుతున్నారు.

ఆదర్శం...

గతంలో అనేక చోట్ల క్యాబ్ డ్రైవర్లు, నిరుపేదలు మేయర్లుగా గెలిచి సమస్యలను చక్కబెట్టిన ఘటనలే తనకు స్ఫూర్తి అని తాను తప్పక బేగంపేట డివిజన్​లో గెలుపొంది.. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న ఫరానా నేటి తరానికి ఆదర్శనంగా నిలుస్తోంది.

Last Updated : Nov 24, 2020, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details