దేశవ్యాప్తంగా 2020- 21లో 500 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 2,650 కిలోమీటర్ల మేర డబ్లింగ్ మార్గాలు, 600 కిలోమీటర్ల మేర గేజ్ మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ పనులకు రూ.14,950 కోట్ల నిధులను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వేకు అందుకనుగుణంగా కేటాయింపు జరిగితే సికింద్రాబాద్- మహబూబ్‌నగర్, గుంటూరు- గుంతకల్లు, విజయవాడ- భీమవరం- నిడదవోలు వంటి జంటమార్గాల పనులకు.. మనోహరాబాద్- కొత్తపల్లి, నడికుడి- శ్రీకాళహస్తి కొత్త లైన్ల పనులకు ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయి.
నిధులు తగ్గే అవకాశం..
స్టేషన్‌లలో ప్రయాణికుల సౌకర్యాలకు ఈసారి నిధులు తగ్గే అవకాశం ఉంది. గతేడాది రూ.3,422 కోట్లు కేటాయించారు. ఈసారి ఆ మొత్తం రూ.2,725 కోట్లకు తగ్గింది. డీజిల్ ఇంజిన్లతో నడిచే మార్గాల విద్యుద్ధీకరణ లక్ష్యం... గత ఏడాది 7 కిలోమీటర్లు ఉండగా, ఈసారి అది 6 వేల కిలోమీటర్లకు తగ్గింది. పాత పట్టాల మార్పిడి లక్ష్యం 3,900 కిలోమీటర్ల నుంచి ఈసారి 4వేల కిలోమీటర్లు పెరగడం కొంత సానుకూలాంశంగా ఉంది. రైలు ఇంజిన్లు, బోగీల వంటి రోలింగ్‌స్టాక్ నిధుల కేటాయింపు రూ.6,114 కోట్ల నుంచి రూ.5,786 కోట్లకు తగ్గింది.