BRS Party Protest Against Gas Price Hike: పెరిగిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లో వంటా-వార్పు కార్యక్రమం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ చౌరస్తా వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ మహిళలు ఆందోళన నిర్వహించారు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే వివేకానందరెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. మలక్‌పేట్‌లో చేపట్టిన నిరసనల్లో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారని నేతలు మండిపడ్డారు.
రూ.10 పైసలు తగ్గించి.. రూ.100 పెంచుతున్నారు..: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే గగ్గోలు పెట్టిన బీజేపీ.. ఇప్పుడు మూడింతలు పెంచిందని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికలు రాగానే గ్యాస్‌పై రూ.10 పైసలు తగ్గించి.. ఎన్నికలు అయిపోగానే రూ.100 పెంచడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెంచుతూ బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
''గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే గగ్గోలు పెట్టిన బీజేపీ.. ఇప్పుడు దానిని మూడింతలు పెంచింది. ఎన్నికలు రాగానే రూ.10 పైసలు తగ్గించడం.. ఎన్నికలు అయిపోగానే రూ.100 పెంచడం బీజేపీకి ఆనవాయితీగా మారింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా అన్నిరకాల నిత్యావసరాల ధరలు పెంచుతూ బీజేపీ ప్రజలను మోసం చేస్తుంది.'' - మంత్రి హరీశ్‌రావు