Investigation on Adani companies: దేశంలో సంక్షోభిత పరిస్థితులు నెలకొన్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మిన్ను విరిగి మీద పడ్డట్లు ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉలుకుపలుకు లేదని ఎద్దేవా చేశారు. ఆదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణమని విమర్శించారు. శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
ఆదానీతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల షేర్ల విలువ గత నెల 23వ తేదీ నుంచి భారీగా పడిపోయాయని, దాంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రూ.3,600గా ఉన్న ఆదానీ షేర్ విలువ ఇప్పుడు దాదాపు రూ.1,400కు పడిపోయిందని ఆమె గుర్తు చేశారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరైతే అంతా బాగేనే ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు.
ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఆదానీ వ్యవహారంపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోదీ మద్ధతుతో ఆదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసు అని అన్నారు.