BRS Ministers Comments On Modi Speech : ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్ర పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల అని.. మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌కు ప్రధాని రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారని.. రాష్ట్రంలో మాత్రం రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం ప్రజలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. 9 ఏళ్లలో యువత కోసం ప్రధాని చేసిన ఒక్క మంచి పనైనా చెప్తే బాగుండేదన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీనే అన్నారు. కేంద్ర పరిధిలోని 16 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయలేదన్న కేటీఆర్.. 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన తమపై నిందలా అంటూ నిలదీశారు.
బిల్లును ఆమోదించకుండా వర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్ ఆపుతున్నారని.. బిల్లులను అడ్డుకుంటున్న గవర్నర్‌కు ప్రధాని ఒక మాట చెబితే బాగుండేదంటూ మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. గిరిజన వర్సిటీని కేంద్రం అడ్డుకొంటుందని.. అడవి బిడ్డలపై ప్రధాని కపట ప్రేమ చూపిస్తున్నారంటూ దుయ్యబట్టారు. బయ్యారం ఫ్యాక్టరీ గురించి ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు.
KTR Comments On Modi Speech : తెలంగాణ తమ కుటుంబం... రాష్ట్ర ప్రజలే తమ కుటుంబ సభ్యులు అంటూ పునరుద్ఘాటించారు. కేంద్ర ఏజెన్సీలను బూచిగా చూపి భయపెట్టాలని చూస్తోందని.. ప్రధాని బెదిరింపులు, ఉడత ఊపులకు మేం భయపడమని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉత్త చేతులతో వచ్చి వెళ్లడం మోదీకి అలవాటే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలింపు :రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను మోదీ గుజరాత్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని.. మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పోడు భూముల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీర్‌రావు పాల్గొన్నారు. దిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమేంటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.